వెన్నెలకి వందనం
సూర్యుడు, సూర్యుడని ఎందుకలా గావుకేకలేస్తావు? మిత్రమా! నిజం చెప్పు- సూటిగా సూర్యుడ్ని చూడగలవా నువ్వు? కాళ్ళతోడేళ్ళు నిన్ను నిన్నలోకి లాగేస్తుంటే- ఎరువు తెచ్చుకున్న గొంతుతో అరవద్దు. అరడజను చప్పట్లకోసం, అరవీశెడు కీర్తి కోసం.... రంగుకాగితాలలో చుట్టిన మాటల చాక్లెట్లను- 'కవిత్వం' అని నమ్మించకు. బాధలు ఎంతగా మండిస్తాయో గుండెను. కణకణ మండే గుండెమీద ఆలోచనలు కుతకుతా ఉడికి - తయారవుతుంది 'కవిత్వం' అసలైన కవిత్వాన్ని అనుభవించటం నేర్చుకో... నువ్వు నువ్వుగా నిల్చోటం నేర్చుకో....... నినాదంగా మాత్రమే కాదు - ఉద్యమాలకి ఊపిరి కాగలగటం నేర్చుకో! గుండెకి జండాలు చుట్టడం కాదు మిత్రమా! గుండెలే కోరికతో ఎర్రగా మండే జండాలు కావాలి. "రాత్రి చీకటి భూమిలో పాతిపెట్టబడ్డ సూర్యుడు వేయికిరణాల ఆకుల్తో చీకటిని చీల్చుకుని పుట్టుకొస్తాడు ఉదయానికల్లా!" -- అని ...