గదిలో.......


గదిలో.....
కాలాన్ని ముక్క, ముక్కగా 
చప్పరిస్తూ  - గడియారం.

రెక్కల పురుగు వెనుక
నక్కి, నక్కి కదుల్తూ - బల్లి.

ఆలోచనలతో అతలాకుతలం
అవుతున్న -  మనస్సు.
***
కిటికీ తెరిస్తే -
ప్రియురాలి గాఢ పరిష్వంగనంలా
ఒళ్లంతా చుట్టేస్తూ - చల్లని గాలి
కిటికిలోంచి
కంటి రెటినా వెనక్కి ప్రయాణిస్తూ
అనేకానేక బొమ్మలు.
***
భయం కళ్ళతో
'కుయ్యో' మంటూ గజ్జికుక్క
                            - ఓ ప్రక్క.

ఒళ్లంతా పూలపరిమళాలతో
ఒయ్యారంగా ఊగే మల్లె, మొల్లలు
                            - మరోప్రక్క.

నల్లటి మబ్బుల మధ్య
మెరుపు తీవెల హడావుడి
                            - ఆ పైన

తియ్యని మట్టివాసనల గుభాళిoపుతో
నేల తల్లిని అభిషేకిస్తూ వర్షపు చినుకుల హేల
                             -ఈ క్రింద.
***
బొమ్మలన్నీ కలల చివరవరకూ పేరుస్తూ
నిద్రని కళ్ళమీద కప్పుతున్న చల్లని గాలి.
ఇప్పుడు-
గదిలో.........
నిద్రలో.......నిశ్శబ్దంగా.......
                                        నేనే!



Comments

Popular posts from this blog

వెన్నెలకి వందనం

ఋతువులు

నీ కోసం.........