కళ్ళలోని నీళ్ళతో వత్సరమంతా మాకు వర్షఋతువే! కష్టం మర్చిపోటానికి తాగిన కాసేపు పుట్టే వెర్రి ఆశే మాకు శరదృతువు! అవసరాలు తీర్చుకుని ఆనక వదిలేస్తే - హేమంతం లోని ఆరిపోయిన భోగిమంటలం మేం! కడుపు కోసం కష్టంతో జీవితమంతా మాకు శిశిరమే! ప్రోద్దంతా కష్టించి ఆ కూలితో గంజైనా తాగితే అదే మాకు వసంతం! పని లేక, తిన తిండి లేక ఎండిపోతున్న మాలో ప్రజ్వరిల్లుతోంది గ్రీష్మం!
ఇక్కడ- ఈ నిరీక్షణ గదిలో నీ కోసమే నేను. నా మనసు మాత్రం నిరంతరం నీ దగ్గరే! ఇక్కడ- కొంటెగాలి అమాయకమైన పువ్వుల్ని అల్లరి పెడుతూంది ఈ పువ్వుల్ని నీ సిగలో దాయాలని ఉంది. ఇక్కడ- తుంటరి చంద్రుడు- వెన్నెల నవ్వుల్ని రువ్వుతున్నాడు ఈ వెన్నెల నీ సున్నిత నగ్నత్వంమీద పరవాలని ఉంది ఇక్కడ- నా పిచ్చి గుండె నీ కోసం ప్రత్యేక రస్తా అయ్యింది. ఇక నువ్వు రావడమే...... నీ పాదపూజకోసం ముద్దుల్ని భద్రపరిచాను. ఆశని బట్వాడా చేసే నీ కనుల కోసం...... నీ కోసం......... ఇక్కడ- ఈ నిరీక్షణ గదిలో... నీ కోసమే... నేను
Comments
Post a Comment